క్రింది వచన భాగాన్ని చదివి, 1 నుండి 5 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
పూర్వకాలమున మనదేశములో పుట్టి పెరిగిన విద్యలలో ఎన్నో రూపుమాసిపోయినవి. నిలిచినవయినా అవన్నీ ఇప్పటి లోకవ్యవహారమునకు అనుకూలముగా లేవు. లోకముతో కూడా మార్పు చెందనిది ఏదీ వృద్ధి పొందదు. లోకమును అనుసరించి మారినవి వృద్ధి పొంది, మారని వాటిని అణగద్రొక్కి, నిర్మూలనము చేయక మానవు. ఇది లోక ధర్మము. మనుష్యులు మృగములే కాదు; చెట్లు చేమలున్ను, రాజ్యములు, వ్యాపారములు, భాషలు, విద్యలు కూడా కాలానుగుణముగా మారని ఎడల వృద్ధి పొందవు. మార్పును బట్టే వృద్ధి. పుట్టినవాడు పుట్టినట్లే కర్రబొమ్మవలె ఉ ండునా ? జంతువులకు జీవము ఎటువంటిదో అటువంటిదే భాషకు నోటి వాటుకా, విద్యకు లోక వ్యవహారముతో సంబంధమున్ను.
పూర్వకాలమున మనదేశంలో ద్విజులే గదా విద్యలు నేర్చుకొనెడివారు. వారిలోనయినా అందరూ కాదు. సర్వసామాన్యముగా ప్రజలందరి కోసము ఉద్దేశించి ఏ రాజున్ను బడులు పెట్టించి విద్యలు చెప్పించలేదు. బ్రిటీషు వారి పరిపాలన వల్లనే మనకు కలిగినది ఆ భాగ్యము. అయితే దురభిమానము చేత పండితులూ, పండితమ్మన్యులున్నూ, నిజము తెలియక విద్యాధికారులున్నూ, ప్రజలకు అందరాని పండుగా చేసినారు. విద్యను. పండితులు కవనము కోసము కల్పించుకున్న కృత్రిమ భాషలో బాలబోధలూ, కథలూ చరిత్రలూ వ్రాస్తూ పిల్లలు చదువులేకుండాను, చదివినా అర్థము కాకుండాను చేసి, ఫస్టుక్లాసు మొదలు బి.ఏ. దాకా తెలుగు చదివినా, ఇంగ్లీషు చదివినా పండితులు వేదాలు, శాస్త్రాలు చదివినట్లు ప్రతీదీ బండవల్లనము వల్లించడము మప్పి, పిల్లల బుద్ధి వికసించకుండా మాడ్చి పాడు చేసినారు.